Chiranjeevi : మెగాస్టార్.. ఒక్క ‘భోళా శంకర్’తో ‘చిరు’పై చిన్నచూపా? ఈ జనరేషన్‌కి మెగా బాక్సాఫీస్ స్టామినా తెలుసా?

ఇప్పుడు భోళా శంకర్ ఫ్లాప్ అయిందని కొంతమంది ఈ జనరేషన్ యువత ఆయనపై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు, చేశారు.

Chiranjeevi : మెగాస్టార్.. ఒక్క ‘భోళా శంకర్’తో ‘చిరు’పై చిన్నచూపా? ఈ జనరేషన్‌కి మెగా బాక్సాఫీస్ స్టామినా తెలుసా?

Megastar Chiranjeevi Birthday Special Article This Generation must know about Chiranjeevi stamina and his range

Megastar Chiranjeevi : చిరంజీవి.. ఈ పేరంటే ఇప్పటి జనరేషన్ కి ఒక సీనియర్ హీరో మాత్రమే. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), భోళా శంకర్ (Bhola Shankar).. ఇప్పటి జనరేషన్ కి ఆయన గురించి తెలిసిందే ఇంతే అనుకుంట. అందుకే ప్రతి సినిమాలోనూ లోపాలు చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన అనుభవంలో సగం వయసు కూడా లేని పిల్లలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది కాదు చిరంజీవి అంటే.. ఈ సినిమాలు కాదు ఆయన్ని మెగాస్టార్ ని చేసింది.

ఒక్కసారి వెన్కక్కి తిరిగి చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీని ముప్పై ఏళ్ళు ఏకచత్రాధిపత్యంగా ఏలిన హీరో. తెలుగు తెరకు కమర్షియల్ సినిమాలకు అర్ధం చెప్పిన హీరో, కమర్షియల్ సక్సెస్ ల మధ్య తన నటనా ప్రావీణ్యాన్ని చూపించిన నటుడు. డ్యాన్స్, ఫైట్స్ లో కొత్తదనం చూపించిన యాక్టర్. ఇవన్నీ తెరపై చేసినవి మాత్రమే. ఇదంతా ఒక్క రాత్రికి రాత్రి వచ్చిన స్టార్ డమ్ కాదు. కొన్ని ఏళ్ళ కృషి, పట్టుదల. సినిమా అనే సముద్రంలో ఎవరూ తెలియకపోయినా వచ్చి ఈదేసి నెంబర్ 1 స్థానానికి చేరుకోవచ్చు అని ప్రూవ్ చేసిన మనిషి మెగాస్టార్.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అని అనుకున్న ప్రతి ఒక్కరికి తలుచుకుంటే అవుతుంది అని స్ఫూర్తి రగిలించిన హీరో మెగాస్టార్. ఆయన సినిమాలు, ఆయన కష్టం, ఆయన ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పున్నమి నాగు సినిమాతో మొదలుపెట్టి న్యాయం కావలి, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, అభిలాష, మగ మహారాజు, ఖైదీ, ఛాలెంజ్, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, స్వయంకృషి, రుద్రవీణ, యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఆపద్భాందవుడు, యముడికి మొగుడు, కొండవీటి దొంగ, చంటబ్బాయి, విజేత, ముఠామేస్త్రి, మెకానిక్ అల్లుడు, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, డాడీ, స్నేహం కోసం, ఇంద్ర, ఠాగూర్, శంకర దాదా MBBS, స్టాలిన్.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇలాంటి చాలా సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు చిరంజీవి.

చిరంజీవి హిట్ కొడితే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ గల్లాపెట్టెలు నిండాల్సిందే. ఆయన పేరు చెప్పుకొని, ఆయన సినిమాలు రిలీజ్ చేసి, ఆయనతో సినిమాలు తీసి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన సాధించిన రికార్డులు లెక్కపెట్టలేనివి, అలాంటి రికార్డులని మల్లి ఆయనే తిరగరాసేవాడు. హిట్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఫ్లాప్ వచ్చినా కూడా నిర్మాతల వెనుక నిలబడి ఇంకో సినిమా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న నిర్మాతలకి డేట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కి హిట్ కావాలన్నా మెగాస్టార్ డేట్స్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు కానీ ఇండియన్ సినిమాని బాలీవుడ్ ఏలుతున్న సమయంలోనే వరుస హిట్స్ కొట్టి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా నిలిచి బిగ్ బి అమితాబ్ కంటే గొప్ప అని బాలీవుడ్ పేపర్లే రాసేలా చేసిన తెలుగు హీరో. ఆల్మోస్ట్ 1995 ముందు పుట్టిన ప్రతి ఒక్కడికి ఆయన గురించి తెలుసు, ఆయన సినిమా కోసం పడ్డ కష్టం తెలుసు, ఆయన ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్స్ తెలుసు.

చిరంజీవి అంటే ఎందుకు అందరికి ఇష్టం. కేవలం కష్టపడి ఎదిగాడనా? సినిమాలు హిట్స్ ఇచ్చాడనా? బాగా నటిస్తాడు, డ్యాన్స్ చేస్తాడనా? వీటితో ఇష్టం వచ్చి ఉండొచ్చు కానీ తెర వెనుక ఆయన్ని చూసి అభిమానం పెంచుకున్నారు. తన కోసం థియేటర్స్ కి పరుగులు పెట్టిన అభిమానుల దగ్గరికి కదిలి వచ్చారు, సేవా కార్యక్రమాలు చేశారు, బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు, తనని మెగాస్టార్ చేసిన తన అభిమానుల కష్టాల్లో తోడు నిలిచారు. అందుకే ఆయన అంటే అందరికి అభిమానం. రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్ళకి కూడా శత్రువులు ఉన్నారు, వాళ్లపై కూడా విమర్శలు చేశారు. అలాంటిది ఒక మనిషి మామూలు స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తిపై విమర్శలు చాలా సహజం.

ఇప్పుడు భోళా శంకర్ ఫ్లాప్ అయిందని కొంతమంది ఈ జనరేషన్ యువత ఆయనపై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు, చేశారు. ఇదే యువత ఒక్కసారి వాళ్ళ నాన్న, తాతయ్య, అమ్మ, అన్నలను, వాళ్ళింట్లో పెద్దవాళ్ళని అడిగితే బాగుండు ఏమో చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పేవాళ్ళు. అయినా ఆయనకు విమర్శలు కొత్తకాదు. ఏదో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆయనపై నెగిటివిటిని చూపిస్తున్నారు. ఒకప్పుడు ఇంతకు మించి ఫ్లాప్స్ కూడా చూసారు. కెరీర్ పీక్ లో వరుస హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. మూడేళ్లు ఒక్క హిట్ లేకపోయినా మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రతి మనిషికి లైఫ్ లో పైకి ఎదగడం, కిందపడటం మామూలే. ఇలాంటివి ఎన్నో చూసేసి ఆయన ఈ స్టేజికి వచ్చారు.

Also Read: మెగా 157.. సోషియో ఫాంటసీ కథతో మరింత కొత్తగా రాబోతున్న మెగాస్టార్

ఇక కొంతమంది అయితే డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నారు, నిర్మాతలని డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టట్లేదు, మార్కెట్ లేకపోయినా రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆయన చూడని డబ్బా? ఆయన చూడని కలెక్షన్సా? ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నా ఇంకో పది తరాలు పైనే సరిపోతుంది. అలాంటి వ్యక్తికి డబ్బులు కావాలా? ఆయన ఇంట్లో అందరూ సంపాదిస్తున్నారు, ఇంకా ఆయన సంపాదించాలా? తన ఫ్రెండ్, నటుడు శరత్ కుమార్ నష్టాల్లో ఉంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన హీరో చిరంజీవి. సినిమా అంటే పిచ్చి, ప్రేమ, ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కడికి చిరంజీవి ఈ ఏజ్ లో కూడా ఎందుకు సినిమాలు చేస్తున్నారో అర్ధమవుతుంది. 60 ఏళ్ళ వయసులో మంచం పట్టి జబ్బులతో గడిపేస్తున్న మనుషులు ఈ కాలంలో ఉన్నారు. కానీ 68 ఏళ్ళకి కూడా ఆరోగ్యంపై, తన బాడీపై ఇంకా శ్రద్ధ పెట్టి మన కోసం కష్టమైనా ఫైట్స్, డ్యాన్సులు చేస్తున్నారు. ఆయన సినిమాలు చేసేది కేవలం సినిమా మీద పిచ్చితో, అభిమానుల మీద ప్రేమతో మాత్రమే..

Pawan Kalyan : చిరుకి చిన్న తమ్ముడి విషెస్.. అన్నయ్య గురించి పవన్ ఏమన్నారో తెలుసా?

అయినా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వాల్తేరు వీరయ్యతో జస్ట్ హిట్ టాక్ వస్తేనే 250 కోట్లు కలెక్ట్ చేసి ఆయన బాక్సాఫీస్ స్టామినా చూపించారు. అలాంటిది భోళా శంకర్ లాంటి పది సినిమాలు వచ్చినా ఆయన స్థాయిని, స్థానాన్ని తగ్గించలేవు. ఇప్పటికి మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఇప్పటి స్టార్ హీరోలు పోటీకి ఆలోచిస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఏంటో. ఆయన అనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తన మనవరాళ్లు, మనవడ్లతో ఆడుకోవచ్చు కానీ సినిమాకి బానిసగా మారి సినిమా కోసమే పని చేస్తున్నారు మనకి ఆనందం ఇవ్వడానికి.

Chiranjeevi Birthday Special : మెగాస్టార్ కెరీర్‌లో ఇది చాలా మాములు విషయం.. కానీ ప్రతిసారి చిరంజీవి ఇచ్చిన సమాధానం..

సినిమా రిలీజ్ అవుతుందంటే మూడు రోజుల ముందే ఆన్లైన్ లో టికెట్స్ రిలీజ్ చేస్తే ఇంట్లో కూర్చొని ఫోన్లో టికెట్లు బుక్ చేసుకునే ఈ జనరేషన్ కి చిరంజీవి సినిమా వస్తుంది అంటే థియేటర్లో టికెట్ల కోసం చొక్కాలు చినిగిపోయినా లైన్ లో నిలబడి టికెట్ సాధిస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలీదు. మల్టీప్లెక్స్ లో కూర్చొని పాప్ కార్న్ తినుకుంటూ సినిమా చూసే ఈ జనరేషన్ కి తెరపై మెగాస్టార్ కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లిపోతుంది అనే విషయం తెలీదు. సెలబ్రిటీ కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతున్న ఈ జనరేషన్ కి చిరంజీవి వస్తున్నాడని తెలిసి కొన్ని గంటల ముందు నుంచే ఎదురుచూసి ఆయన కనపడితే చాలు దూరం నుంచి చూసి ఒక దండం పెట్టుకొని వెళ్ళిపోతాం అనుకోని వచ్చే ఆనందం వాళ్లకి తెలీదు.

Chiranjeevi Birthday Special : చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వస్తున్నారు, వస్తారు.. కానీ అందులో 99 శాతం మందికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవే.. ఇప్పటి జనరేషన్ ఇష్టపడే హీరోలు, నటీనటుల ఫేవరేట్ కూడా చిరంజీవే అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. అయినా రాళ్లతో కొట్టి ఎవరెస్టు శిఖరం ఎత్తు తగ్గించగలమా, ఆకాశానికి ఎదిగిన ఆయన్ని విమర్శించి ఆయన స్థాయిని తగ్గించగలమా? ఒక్క సినిమానో కొన్ని సినిమాలో ఫ్లాప్ అయ్యాయని.. అది కూడా ఆయన ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని మనకోసం సినిమాలకు ఇస్తున్న సమయంలో ఎన్ని సినిమాలు తీసినా తీయకపోయినా, అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన్ని విమర్శించాల్సిన అవసరం అంతకంటే లేదు. సోషల్ మీడియా అనే నెగిటివిటి ప్రపంచంలో బతుకుతున్న ఈ జనరేషన్ ఆయన గురించి మాట్లాడేముందు ఆయన గురించి తెలుసుకోవడం ఉత్తమం. విమర్శలను ఆయన్ని తాకని స్థాయికి ఆయన ఈ జనరేషన్ పుట్టకముందే చేరుకున్నారు. ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. మెగాస్టార్ ఒక్కడే.. అది చిరంజీవి మాత్రమే.